Uttarakhand : ఉత్తరాఖండ్‌లో తగ్గని వరదలు.. మునిగిన భారీ శివుడి విగ్రహం

దేవభూమి గా పేరొందిన ఉత్తరాఖండ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపాపత్, అల్మోరా, పిథోర్ఢ్ ఉధమ్సంగ్ నగర్ తోపాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారంరోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
డెహ్రాడూన్, తేహ్రి, హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, అలకనంద, భాగీరథీ, శారద, మందాకిని, కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకొని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు. గత 24 గంటల్లో అల్మోరాలోని చౌకుతియా ప్రాంతంలో 72.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఘట్ 59 మి.మీ, చంపావల్లో 45 మి.మీ, కాశీపుర్లో 42 మి.మీ, హల్ద్వానీలో 31 మి.మీ వర్షపాతం నమోదైంది.
అలకనంద నది ఉప్పొంగ డంతో రుద్రప్రయాగ్ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. ఈనేపథ్యంలో అక్కడి వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com