G20 MEET: జీ 20 సదస్సుపై యుద్ధం ప్రభావం

ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ధాన్యం, గోధుమల ఎగుమతి సహా అనేక సరఫరా వ్యవస్థలపై పుతిన్ దండయాత్ర పెను ప్రభావాన్ని చూపింది. ఈ ప్రభావంతో చాలా దేశాల ఆర్థిక వృద్ధి గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధం ప్రభావం ఢిల్లీ వేదికగా జరిగే జీ-20 సదస్సుపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, రష్యా మొండి పట్టుదలతో ఈ సదస్సులో సంయుక్త ప్రకటన సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండించని ప్రకటనపై తాము సంతకం చేయబోమని జర్మనీలాంటి దేశాలు స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. అందుకు రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏకాభిప్రాయం కుదరకపోతే 1999లో కూటమి మొదలైన తర్వాత ఎలాంటి సంయుక్త ప్రకటన లేకుండా ముగిసే తొలి సదస్సు ఇదే అవుతుంది. దేశాల కూటముల శిఖరాగ్ర సదస్సుల్లో చివర్లో విడుదల చేసే సంయుక్త ప్రకటనే కీలకం. సదస్సు జరిగిన తీరు తెన్నులకు, లక్ష్యాలకు, భవిష్యత్ నడకకు అది అద్దం పడుతుంది. అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, భారత్‌లాంటి ప్రపంచంలోని 20 కీలక దేశాల కూటమి జీ20 దాదాపు 75శాతానికిపైగా ఆర్థిక ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ కూటమి ఏం చెబుతుందోనని యావత్ మానవాళి ఆసక్తిగా చూస్తుంది.
ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరిగే జీ-20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సంయుక్త ప్రకటన ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టం కావడం లేదు. జీ-20 దేశాల అధినేతల తరఫున వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొనే వ్యక్తిగత ప్రతినిధులను షెర్పాలుగా పిలుస్తారు. భారత్ తరఫున షెర్పాగా అమితాబ్‌కాంత్ వ్యవహరిస్తున్నారు. వీరు అధినేతల సదస్సు కంటే ముందే సమావేశమై, ఏమైనా ఇబ్బందులు, సమస్యలుంటే పరిష్కరించి, శిఖరాగ్ర సదస్సు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. మూడురోజుల పాటు జరిగే షెర్పాల సమావేశం హరియాణాలో ఇప్పటికే ఆరంభమైంది. సంయుక్త ప్రకటన విడుదలకు ఏకాభిప్రాయ సాధనే ఎజెండాగా ఈ సమావేశంలో వాడిగావేడిగా చర్చలు జరుగుతున్నాయి.
ఢిల్లీ డిక్లరేషన్ విడుదల చేసేలా భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎజెండాలోని అంశాలపై చైనాకు పలు అభ్యంతరాలు ఉండడంతో ఏకాభిప్రాయ సాధన కష్టమవుతోంది. జీ-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన తర్వాత వివిధ స్థాయుల్లో 150 వరకు జీ-20 సమావేశాలు జరిగాయి. ఏ భేటీలోనూ కలసికట్టుగా ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేకపోయారు. అమెరికా, రష్యా మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలే అందుకు కారణం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com