Wedding Convoy : ఇదెక్కడి తనిఖీరా మావ.. పెళ్లి బృందం వాహనంలో సారె సీజ్‌

Wedding Convoy :  ఇదెక్కడి తనిఖీరా మావ.. పెళ్లి బృందం వాహనంలో సారె సీజ్‌

ఎన్నికల వేళ తగ్గేదేలే అంటున్నారు పోలీసులు. ఈసీ ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.

యాదమరి బైపాస్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న పెళ్లి బృందం వాహనాన్ని ఆపి పూర్తిగా చెక్ చేశారు. వివాహం సందర్భంగా పెళ్లి కూతురికి తీసుకెళ్తున్న సారెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వద్దు మొర్రో అని పెళ్లివారు మొత్తుకున్నా పోలీసులు వినలేదు.

సారెకు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో 14 కిలోల వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. వివాహానికి వెళ్తున్నామని చెప్పినా.. తమ విడిచి పెట్టలేదని, పెళ్లి కూతురు సారెను కూడా సీజ్ చేయడం దుర్మార్గమని పెళ్లి బృందం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత వస్తువులు ఉంటాయి కాబట్టి వీటిని కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు ఎలా తీసుకురావాలని అంటున్నారు పెళ్లివాళ్లు.

Tags

Read MoreRead Less
Next Story