Lok Sabha : లోక్‌సభ బరిలో మహిళా అభ్యర్థులు 10శాతం కన్నా తక్కువే

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2014(8,251 మంది), 2019(8,054 మంది) ఎన్నికల కంటే ఈ సంఖ్య ఎక్కువ. ఇందులో మహిళల వాటా 10శాతం లోపే ఉంది. చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంత తక్కువ మొత్తంలో మహిళలు పోటీకి దిగడం గమనార్హం. ఇక జూన్ 4న వీరందరి భవితవ్యం వెల్లడి కానుంది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళలు 10శాతం కన్నా తక్కువేనని ADR నివేదిక పేర్కొంది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో 797 మంది మహిళలు ఉన్నారని.. ఇది కేవలం 9.5 శాతమేనని తెలిపింది. దీంతో లింగ వివక్షకు చోటివ్వకుండా స్త్రీలకు తగిన సంఖ్యలో ప్రాధాన్యం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవే కావడం విశేషం. సుమారు 27 సంవత్సరాలపాటు పార్టీల మధ్య సంప్రదింపుల పేరుతో పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు ఆమోదం పొందినా ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో అతివలకు మూడోవంతు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల్లో లింగ వివక్షపై రాజకీయ విశ్లేషకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com