India GDP : అగ్రరాజ్యాలకే షాక్.. దూసుకుపోతున్న భారత జీడీపీ.. ప్రపంచ బ్యాంక్ క్లీన్ చిట్.

India GDP : భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికను విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా పెంచుతూ సానుకూల సంకేతాలు ఇచ్చింది. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం భారత్ వృద్ధికి స్పీడ్ బ్రేకర్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచ బ్యాంక్ తన దక్షిణ ఆసియా ఆర్థిక అప్‌డేట్ నివేదికలో భారత్ వృద్ధి రేటుపై కీలక అంచనాలు వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత్ వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనా వేసింది. గతంలో ఇది 6.5 శాతంగా ఉంటుందని భావించినప్పటికీ, ఇప్పుడు దానిని స్వల్పంగా పెంచింది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 6.9 శాతం కంటే ఇది తక్కువే కావడం గమనార్హం. 2025లో 7.1 శాతం, 2026లో ఏకంగా 7.6 శాతానికి వృద్ధి రేటు చేరుకుంటుందని, కానీ ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల 2027 నాటికి 6.6 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ విశ్లేషించింది.
వస్తు సేవల పన్ను రేట్లలో కోతలు విధించడం వల్ల దేశంలో వినియోగదారుల డిమాండ్ పెరుగుతుందని నివేదిక పేర్కొంది. పన్నులు తగ్గితే ప్రజలు ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుంది, తద్వారా మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకుంటాయి. ముఖ్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న ద్రవ్యోల్బణం, స్థిరమైన ఎగుమతులు కూడా భారత్‌కు కలిసి వచ్చే అంశాలని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది.
భారత్ వృద్ధికి ప్రధాన అడ్డంకి అంతర్జాతీయ పరిస్థితులేనని నివేదిక హెచ్చరించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలం అవుతోంది. ముడి చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత్ లోని సామాన్యుల ఖర్చుపై పడుతుంది. యుద్ధం కారణంగా సరుకు రవాణాలో అంతరాయాలు కలగడం వల్ల ముడి పదార్థాల ధరలు పెరిగి, కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. రెండు వారాల యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ, పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని తెలిపింది.
భవిష్యత్తులో ప్రభుత్వ ఖర్చుల వేగం తగ్గే అవకాశం ఉందని నివేదిక విశ్లేషించింది. ముఖ్యంగా వంట గ్యాస్, ఎరువులపై ఇస్తున్న సబ్సిడీల భారం పెరగడమే దీనికి కారణం. మరోవైపు, అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల భారత్ ఎగుమతులపై కూడా ప్రభావం పడవచ్చని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. ఏది ఏమైనా, మిగిలిన దక్షిణ ఆసియా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, సరైన సంస్కరణలు ఉంటే సవాళ్లను అధిగమించవచ్చని నివేదిక స్పష్టం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
