PARA OLYMPICS: భారత "అవని" పులకించేలా..
పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఒకే రోజు నాలుగు పతకాలు కొల్లగొట్టి చరిత్ర సృష్టించారు. అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్-1 విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో మోనా కాంస్యం గెలిచింది. షూటర్ మనీష్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో 234.9 స్కోరుతో రజతాన్ని కైవసం చేసుకున్నాడు. 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్యంతో మెరిసింది.
అవనీ సరికొత్త చరిత్ర
పారిస్ పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్-1 విభాగంలో భారత స్టార్ షూటర్ అవని లేఖరా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండో పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి భారత మహిళగా అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది. 249.7 పాయింట్లతో టాప్‌లో నిలిచి అవనీ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో మోనా 228.7 పాయింట్లతో కాంస్యం సాధించింది. దీంతో భారత్‌కు ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు వచ్చాయి. దక్షిణ కొరియా షూటర్ లీ యున్రి 246.8 పాయింట్లతో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఒక దశలో సిల్వర్ మెడల్‌కే పరిమతమయ్యేలా కనిపించిన అవనీ... ఒత్తిడిని జయిస్తూ చివరి షాట్‌లో 10.5 పాయింట్ల సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఒత్తిడికి చిత్తయిన దక్షిణ కొరియా షూటర్ చివరి షాట్‌లో కేవలం 6.5 పాయింట్లు 6.8 పాయింట్లకే పరిమితం అవ్వగా అవని 10.5తో అగ్రస్థానానికి దూసుకెళ్లి గోల్డ్ మెడల్ సాధించింది. మోనా తన అరంగేట్రం పారా ఒలింపిక్స్‌లోనే దేశానికి తొలి పతకాన్ని అందించింది.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ మనీష్ నర్వాల్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో 234.9 స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో దక్షిణకొరియాకు చెందిన జియోంగ్డు జో 237.4 స్కోరుతో స్వర్ణం గెలిచాడు. చైనా షూటర్ చావో యాంగ్ 214.3 స్కోరుతో కాంస్యం సాధించాడు. 2020లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన మనీష్.. ఈసారి రజతంతో మెరిశాడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకం సాధించిన షూటర్‌గా రికార్డు సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీస్ చేరి పతక ఆశలు సజీవంగా ఉంచారు. మరో షట్లర్లు మానసి జోషి, మనోజ్ సర్కార్ పరాజయంతో పారా ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com