AP: తూతూమంత్రంగా ఓటరు జాబితా సవరణ

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండో రోజు ఓటరు జాబితా సమగ్ర సవరణలో చాలాచోట్ల అవకతవకలు బయటపడ్డాయి. పలు జిల్లాల్లో అనేక చోట్ల BLOలు పోలింగ్ కేంద్రాలకు రాలేదు. BLOల తీరుపై విపక్ష నేతలు, ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా తూతూమంత్రంగా సాగింది. NTR జిల్లా నందిగామలోని డాన్‌బాస్కో పాఠశాలలో 3 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇద్దరు BLOలు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు నియోజకవర్గంలోని ఓట్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉంది. 79వ పోలింగ్ బూత్‌లో కొంతమందికి రెండేసి ఓట్లు ఉన్నాయి. తిరువూరులోని ఓటరు జాబితాలోనూ చాలా అవకతకలు ఉన్నాయి. చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీ, షిఫ్టింగ్‌పై తెలుగుదేశం కౌన్సిలర్లు BLOలకు ఫిర్యాదు చేశారు. దాదాపు 16 బూత్‌లలో BLOలు చెట్ల కిందే విధులు నిర్వహిస్తూ కనిపించారు.
బంటుమిల్లిలోని 6 పోలింగ్ కేంద్రాలు ఒక్కటి కూడా ఉదయం 11 గంటల 40 నిమిషాల వరకు తెరుచుకోలేదు. కేంద్రాల్లో ఓటరు లిస్టు కూడా అందుబాటులో లేదు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లంకమ్మమాన్యంలో ఒకే ఇంటి నెంబర్‌తో 90 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. మరికొన్ని ఇంటి నెంబర్లతోనూ పదుల సంఖ్యలో ఓట్లు ఉండటాన్నితెలుగుదేశం నేతలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంతమంది BLOలు పోలింగ్ స్టేషన్‌కు ఆలస్యంగా వచ్చారు. వేటపాలెం మండలం కొత్తపేటలోని 154వ పోలింగ్ కేంద్రానికి తాళం వేసి ఉండటంతో BLO గేటు దగ్గరే విధులు నిర్వహించారు. ఒంగోలులో.. కొత్తగా ఓటు నమోదు కోసం అందజేసిన అర్జీల్లో మూడొంతులు జాబితాలో లేవు. అంతేకాక చాలాచోట్ల మృతుల పేర్లు తొలగించకుండానే.. జాబితా విడుదల చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓట్ల పరిశీలన సర్వే సమయంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు BLO లను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
గుంటూరు జిల్లాలోని ఓట్ల జాబితాతప్పులతడకగా ఉంది. చేబ్రోలు మండలం పోలింగ్ బూత్ నెంబర్ 141లో ఒకే డోర్ నెంబర్‌పై 24 ఓట్లు ఉన్నాయి. అయితే ఆ జాబితాలోని వారెవరు ఆ ఇంటి నెంబర్‌లో గతంలో గాని ప్రస్తుతం గాని నివాసం ఉండటం లేదు. మృతి చెందిన వారి పేర్లూ జాబితాలో వస్తున్నాయి. మంగళగిరిలోని భార్గవ్‌పేట వారికిటిడ్కో ఇళ్ల కోసమని ఓట్లను అక్కడికి మార్చారు. టిడ్కో నివాస ప్రాంతంలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల.. తమ ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com