BCCI Decision : పాకిస్తాన్ తో మ్యాచ్ లకు దూరం.. బీసీసీఐ నిర్ణయం

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దాయాది పాకిస్థాన్‌తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. "మేము ఉగ్రదాడి బాధితులతోనే ఉన్నాం. ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపై భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడం. కానీ, ఐసీసీ ఈవెంట్ విషయానికి వస్తే, దాని నిబంధనల కారణంగా మేము ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏమి జరుగుతుందో ఐసీసీకి కూడా తెలుసు" అని ఆయన స్పోర్ట్స్ టాక్‌తో అన్నారు.
ఈ ఉగ్రదాడిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "మంగళవారం పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో అమాయకులు ప్రాణాలను కోల్పోవడం క్రికెట్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా బాధపెట్టింది. బీసీసీఐ తరపున ఈ భయంకరమైన, పిరికి చర్యను ఖండిస్తున్నా. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి బాధ, దుఃఖాన్ని పంచుకుంటూ, ఈ విషాద సమయంలో మేము వారికి మద్దతుగా నిలబడతాం" అని సైకియా అన్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరస్‌లు జరగడం లేదు. 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పాకిస్థాన్ భారతదేశానికి వచ్చిన తర్వాత నుంచి రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. ఇక, భారత్ చివరిసారిగా 2008లో పాక్‌కు వెళ్లింది.
దాయాది దేశాలు కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్ జట్టు 2023 వన్డే ప్రపంచ కప్ కోసం భారత్‌కు వచ్చింది. అయితే, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ ససేమీరా అంది. దీంతో టీమిండియా తన మ్యాచ్‌లన్నింటినీ ఫైనల్‌తో సహా దుబాయ్ వేదికగా ఆడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com