India Coach : ఇండియా కోచ్ దరఖాస్తులకు ముగిసిన డెడ్‌లైన్

టీమ్ ఇండియా కోచ్ పదవి దరఖాస్తు గడువు నేటితో ముగిసింది. కేకేఆర్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపిన గౌతమ్ గంభీర్ కోచ్ రేసులో ఉన్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ.. ఆ జట్టు అతడిని వదిలేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చని సమాచారం. ఇక NCA బాధ్యతలు చూస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ సంప్రదించగా, ఆయన సుముఖంగా లేరని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. విదేశీ కోచ్‌లలో ప్రముఖులెవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.
ఇక, టీమిండియా హెడ్ కోచ్‍ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. “తుదిగడువు అయిపోయింది. కానీ తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ అధినాయకత్వం మరింత సమయం తీసుకుంటుంది. జూన్ నెలలో టీ20 ప్రపంచకప్‍తో టీమిండియా బిజీగా ఉంటుంది. ఆ తర్వాత శ్రీలంక, జింబాబ్వేతో జరిగే సిరీస్‍లకు సీనియర్ల ప్లేయర్లకు విశ్రాంతినిస్తుంది. ఆ సిరీస్‍లకు ఎన్‍సీఏ నుంచి సీనియర్ కోచ్ ఎవరైనా జట్టుతో ఉంటారు. అందుకే తొందరేం లేదు” అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్టు పీటీఐ వెల్లడించింది.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన బీసీసీఐ సెక్రెటరీ జై షా.. గంభీర్‌తో మాట్లాడుతూ కనిపించాడు. హెడ్ కోచ్ పదవి గురించే చర్చించినట్టు జాతీయ మీడియాలో వస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐగానీ, గంభీర్‌గానీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com