Cricket : భారత్‌కు హ్యాట్సాఫ్.. షోయబ్ అక్తర్ కీలక కామెంట్స్

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత షేక్‌హ్యాండ్ వివాదంపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించారు. విజయం సాధించిన భారత జట్టును ప్రశంసిస్తూనే, క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టొద్దని కోరారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
అక్తర్ ఆవేదన, సూర్యకుమార్ యాదవ్ వివరణ "నాకు మాటలు రావడంలేదు. ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు. తీవ్రంగా బాధించింది. విజయం సాధించిన టీమ్ఇండియాకు హ్యాట్సాఫ్. కానీ ఇలాంటి వాటిని రాజకీయం చేయొద్దు. క్రికెట్‌ను దాంతో ముడిపెట్టొద్దు" అని అక్తర్ అన్నారు. కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయని, వాటిని మరిచిపోయి ముందుకు వెళ్లాలని, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు, భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "మేం కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం" అని స్పష్టం చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనలను గౌరవిస్తూ భారత్ ఈ మ్యాచ్ ఆడిందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
పాక్ బ్యాటర్లపై వసీం అక్రమ్ విమర్శలు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తమ జట్టు బ్యాటర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారని విమర్శించారు. "కుల్‌దీప్ బంతిని విసిరే విధానాన్ని పాక్ బ్యాటర్లు అస్సలు రీడ్ చేయలేకపోయారు. మ్యాచ్‌కు ముందు సునీల్ గావస్కర్‌తో మాట్లాడినప్పుడు, ఆయన ఒకటే చెప్పారు.. బంతి కుల్‌దీప్ చేతి నుంచి పిచ్‌పై పడే వరకూ నిశితంగా పరిశీలించాలి. లేదంటే అతడిని ఎదుర్కోవడం కష్టం అని అన్నారు. కానీ పాక్ బ్యాటర్లు ప్రతి రెండో బంతిని స్వీప్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించారు, దానివల్ల సరిగ్గా అంచనా వేయలేకపోయారని తెలుస్తుంది" అని అక్రమ్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com