IPL 2024: నేడు చెన్నైతో ఆర్సీబీ కీలక పోరు.. ప్లేఆఫ్ కు వెళ్లేదెవరు?
ఐపిఎల్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుకు నెలకొంది. ప్రస్తుతం బెంగళూరు 12 పాయింట్లతో ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై నేరుగా నాకౌట్‌కు దూసుకెళుతోంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా సిఎస్‌కె ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఇక శనివారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదే జరిగితే బెంగళూరు ఇంటిదారి పట్టక తప్పదు. ఒకవేళ మ్యాచ్ సాగితే బెంగళూరు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు, చెన్నైల మధ్య గట్టి పోటీ నెలకొంది. బెంగళూరుతో పోల్చితే చెన్నై ప్రస్తుతం రన్‌రేట్‌తో పాటు పాయింట్ల అంశంలో మెరుగైన స్థానంలో ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడినా రన్‌రేట్‌ను కాపాడుకుంటే ప్లేఆఫ్‌కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో కిందటి మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. అయితే దాదాపు వారం రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.
మరోవైపు బెంగళూరు వరుస విజయాలతో జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి నాకౌట్ రేసులో నిలిచింది. ఆరంభంలో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన బెంగళూరు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా మ్యాచ్‌లను గెలుస్తూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. ప్రారంభంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన డుప్లెసిస్ ఆ తర్వాత గాడిలో పడ్డాడు. విరాట్ కోహ్లితో కలిసి జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. డుప్లెసిస్, కోహ్లిలు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగ్గా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరి నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. విల్ జాక్స్, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్, దినేశ్ కార్తీక్ తదితరులతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బౌలింగ్‌లోనూ బెంగళూరు పటిష్టంగానే కనిపిస్తోంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ఛాలెంజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com