Afg vs Ire : టెస్టుల్లో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

పసికూన ఐర్లాండ్ కొత్త చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. 2018లో టెస్ట్ హోదా పొందిన ఐర్లాండ్.. ఆరేళ్ల నిరీక్షణకు తెరదించి తొలి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్గాస్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఐర్లాండ్ 31.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కెప్టెన్ ఆండీ బాల్ బిర్నీ (58 నాటౌట్; 96 బంతుల్లో 5 ఫోర్లు) చివరి వరకు ఉండి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి లోర్కాన్ టక్కర్ (27 నాటౌట్) మంచి సహకారం అందించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 218 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (55), గుర్బాజ్ (46), నూర్ ఆలీ జద్రాన్ (32) రాణించారు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో అఫ్గాన్ 155 పరుగులకే కుప్పకూలగా.. తర్వాత ఐర్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐరీష్ జట్టుకు 108 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఈ మ్యాచ్లో 8 వికెట్లతో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ మార్క్ అడైర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com