IPL 2024 : ముంబై ఇండియన్స్ అక్కడే తప్పు చేసింది..

ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అవుతుందని ఆశ పెట్టుకున్న అభిమానులను నిరాశపరుస్తూ వరుస ఓటములతో రేసు నుంచి తప్పుకుంది. ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడే గెలిచిన ముంబై 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఆ జట్టు 12 పాయింట్లే సాధిస్తుంది. ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంది. ముంబైకి ప్లే ఆఫ్ కు చేరే అవకాశం కూడా లేకపోయింది.
శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోవడంతో అధికారికంగా ముంబై ప్లే ఆఫ్ రేసుకు దూరమైంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి ఈ సారి ఏదీ కలిసి రాలేదు. ఆ జట్టు పేలవ ప్రదర్శనకు కారణాలను చూస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్సీ మార్పు గురించే… గుజరాత్ సారథిగా ఉన్న హార్థిక్ పాండ్యాను ట్రేడింగ్‌లో భారీ మొత్తం వెచ్చించి జట్టులోకి తిరిగి తీసుకొచ్చింది. వచ్చీరాగానే రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించి హార్థిక్‌కు పగ్గాలు అప్పగించింది. దీనిపై ముంబై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాండ్యా, రోహిత్ వర్గంగా అభిమానులు చీలిపోయారన్నది ఓ టాక్. ఒకరినొకరు సొంతటీమ్ నే ట్రోల్ చేశారు. టీంలో ఓ యూనిటీ మిస్ అయింది. ఇది జట్టు ఆటతీరుపై ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రభావం చూపిందని చెబుతున్నారు. ముఖ్యంగా హార్థిక్ టాస్‌కు వచ్చినప్పుడు, ఫీల్టింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ రోహిత్..రోహిత్ అంటూ గేలి చేయడం అతన్ని సైకలాజికల్‌గా దెబ్బతీసింది. అదే సమయంలో కెప్టెన్‌గా హార్థిక్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అద్భుతమైన బౌలింగ్ వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయాడు. పలు సందర్భాల్లో స్టార్ పేసర్ బూమ్రాను కూడా సరిగ్గా వాడుకోలేదని విమర్శలు వచ్చాయి. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ హార్థిక్ వ్యూహత్మకంగా వ్యవహరించేదన్న విమర్శ ఉంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అనుకున్న స్థాయిలో రాణించలేదు. సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ , పాండ్యా కూడా విఫలమయ్యారు. తిలక్ వర్మ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా నిలకడలేమితోనే ఇబ్బందిపడడం ముంబైని దెబ్బతీసింది. మిగిలిన మ్యాచ్ లలో ఫామ్ చూపి ఫ్యాన్స్ ను సంతృప్తి పరుస్తారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com