పారాలింపిక్స్ పతక విజేతలతో మోదీ.. వీడియోను షేర్ చేసిన స్పోర్ట్స్ అథారిటీ

పారాలింపిక్స్ పతక విజేతలతో మోదీ.. వీడియోను షేర్ చేసిన స్పోర్ట్స్ అథారిటీ
X

ఇటీవల పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు.రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. స్వదేశానికి చేరుకున్న పతక విజేతలతో ప్రధాని మోదీ గురువారం డిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మెడల్స్‌ సాధించారని అథ్లెట్లను ప్రశంసించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళా ఆర్చర్ శీతల్ దేవి ప్రధాని మోదీకి స్పెషల్ గిప్ట్ ఇచ్చారు. ఆమె కాలితో జెర్సీపై సంతకం చేసి మోదీకి బహుకరించారు. శీతల్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఆపాయ్యంగా మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. శీతల్ దేవి రెండు చేతులు లేకున్నా తన కాలితో విల్లును పట్టుకుని భుజం సాయంతో బాణాలు విసిరి సంభ్రమశ్చర్యానికి గురిచేస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో నిరాశపర్చిన ఆమె కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో రాకేశ్‌ కుమార్‌తో కలిసి కాంస్యం సాధించింది. పురుషుల ఎఫ్‌41 జావెలిన్‌త్రోలో గోల్డ్ సాధించిన నవ్‌దీప్‌ సింగ్‌తో కూడా ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధానికి నవ్‌దీప్‌ టోపీని బహుకరించారు. ఈ ప్రత్యేక బహుమతిని స్వీకరించడానికి ప్రధాని నేలపై కూర్చోవడం విశేషం. అనంతరం నవ్‌దీప్‌ భుజంపై ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని కోరగా మోదీ నవ్వుతూ సంతకం చేశారు. మరుగుజ్జు విభాగంలో పోటీపడిన నవ్‌దీప్‌ ఫైనల్‌ త్రో విసిరిన ప్రతిసారి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయాన్ని అతనితో ప్రధాని ప్రస్తావించగా.. ‘గత పారాలింపిక్స్‌లో తాను నాలుగో స్థానంలో నిలిచా. అందుకే కాస్త భావోద్వేగానికి గురయ్యా. ఈసారి పతకం తెస్తానని మీకు మాటిచ్చా. మెడల్ కూడా సాధించాను’అని నవదీప్‌ మోదీతో అన్నాడు.

Tags

Next Story