Road Accident: రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మృతి..

Road Accident: తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం గౌహతి నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న 83వ సీనియర్ జాతీయ అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల కోసం అతడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు వెళ్తున్నాడు. విశ్వతో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు రమేష్ సంతోష్ కుమార్, అబినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్, కిషోర్ కుమార్ లకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మార్గమధ్యంలో ఓ భారీ వాహనం వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, విశ్వ చనిపోయినట్లు నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
విశ్వ, అనేక జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన ఆటగాడు, ఏప్రిల్ 27 నుండి ఆస్ట్రియాలోని లింజ్‌లో జరిగే WTT యూత్ కంటెండర్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
విశ్వ మృతికి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు. విశ్వ ఒక లెజెండ్ ఆటగాడు అని, ఇంత త్వరగా నిష్క్రమించడం తనకు బాధ కలిగించిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. తల్లిదండ్రులకు సీఎం రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com