Medaram Jatara : మేడారంలో మహత్తర ఘట్టం... అస్సలు మిస్ కావద్దు

Medaram Jatara : మేడారంలో మహత్తర ఘట్టం... అస్సలు మిస్ కావద్దు

మేడారం (Medaram) గద్దెపైకి అమ్మలు చేరుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి దాదాపు 12.15 గంటలకు సారలమ్మను గద్దెలపై ప్రతిష్టించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.

జన జాతరలో అసలైన అపూర్వఘట్టం గురువారం సాయంత్రం జరగనుంది. మేడారంలోని చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గురువారం సాయంత్రం గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ఘట్టాన్ని ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క తల్లిని పూజారులు గురువారం గద్దెల వద్దకు తీసుకురానుండగా.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం గిరిజన పూజారులు చిలకలగుట్టలోని అడవిలోకి వెళ్లి కంకవనం తెచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెల పైకి తీసుకు వచ్చే క్రతువును మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పూజారులు, వడ్డెలు చిలకలగుట్టలోకి వెళ్తారు.

ప్రధాన పూజారి కక్కెర కృష్ణయ్య గుట్టపైకి వెళ్లి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద దాదాపు మూడు గంటల పాటు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత పూజారిపై అమ్మవారు పూనిన తరువాత కుంకుమ భరిణె రూపంలో అమ్మవారిని తీసుకుని కిందికి వస్తారు. సమ్మక్క ఆగమనానికి సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఏకే 47 గన్ తో గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఇది సమ్మక్క మహాజాతరలో ప్రధాన ఘట్టం. అనంతరం సమ్మక్కను గద్దె తీసుకువస్తుంటారు. ఈ సమయంలో సమ్మక్కను తాకేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.

దీంతోనే సమ్మక్క రాక సందర్భంగా దారి పొడవునా జనాలు పెద్ద ఎత్తున మోహరించి ఉంటారు. ఇలా పోటీపడే క్రమంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండటంతో ప్రత్యేక పోలీసుల బలగాలు, రోప్ పార్టీ భద్రత సహా మూడంచెల భద్రత నడుమ సమ్మక్కను ఆలయానికి తోడ్కొని వస్తారు. అనంతరం గద్దెల పై సమ్మక్క తల్లిని ప్రతిష్టిస్తారు. గురువారం నుంచి కిటకిటలాడే ఛాన్స్ ఉంది. కాగా బుధవారం ఒక్కరోజే దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తుండగా.. సమ్మక్క ఆగమనం తరువాత భక్తుల తాకిడి మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story