TG : నెల కిందటే ఏఈ ఉద్యోగం.. నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్డు ప్రమాదంలో యువతి సహా నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీసుస్టేషన్ పరిధిలో నర్సాపూర్ ఫారెస్ట్ నల్లవల్లి వద్ద శుక్రవారం రెండు ఆటోలను కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. బాలా నగర్-మెదక్ జాతీయ రహదారిలో నల్లవల్లి మేడలమ్మ ఆలయం వద్ద రెండు ఆటోలను నర్సాపూర్ నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన నర్సాపూర్ పంచాయతీ రాజ్ ఏఈ పాపగారి మనీషా (26), సూరారంకు చెందిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య (23), ఎల్లారెడ్డి గుడా తండాకు చెందిన ములావత్ ప్రవీణ్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కౌడిపల్లికి చెందిన అనసూయ(60) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతదేహాలు రక్తపు మడుగులో చెల్లాచెదురుగా పడివున్న దృశ్యాన్ని చూసి స్థానికులు చలించి పోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కారు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపించడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెంకట్ రెడ్డి - కవిత దంపతుల కూతురు మనిషాకు మూడు నెలల క్రితమే పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మనీషా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన మూలావత్ ప్రవీణ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కౌడిపల్లికి చెందిన నిరుపేద అయిన అనసూయతోపాటు విద్యార్ధిని ఐశ్వర్య చనిపోవడంతో నాలుగు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. గుమ్మడిదల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com