Weather Department : రానున్న నాలుగు రోజులు జాగ్రత్త .. వాతావరణ శాఖ హెచ్చరిక

రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న నాలుగు రోజుల్లో మహబూబాబాద్‌లో 42.2 డిగ్రీలు, ములుగులో 42.6 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 43 డిగ్రీలు హనుమకొండలో 42.3 డిగ్రీలు, జనగామలో 41.9 డిగ్రీలు, వరంగల్‌లో 42.6 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రత రికార్డయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనితో పాటు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్రంగా వడగాలులు వీచాయి. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొన్నది. వడగాలులు వీస్తున్నందువల్ల ప్రజలు ఇళ్లలో ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు వడగాలుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఠారెత్తిస్తున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ద్రోణి రూపంలో చల్లటి కబురు అందింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మంగళ, బుధవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com