Love Marriage : ప్రేమించి పెళ్లి చేసుకుని వేధింపులు

ప్రేమించి పెళ్లి చేసుకుని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని డబ్బులు తీసుకుని వేరే మహిళలతో ఫోన్ చేయించి వేధిస్తున్నాడని ఓ మహిళ మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదులూరి కనకమహాలక్ష్మి, బిల్లాకుర్తి అప్పారెడ్డి ప్రేమించుకున్నారు. గతేడాది ఆగస్టులో వివాహం చేసుకుని మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహం అయిన నెల తర్వాత తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని రూ.30లక్షలు కావాలని అప్పారెడ్డి కనకమహాలక్ష్మిని అడిగాడు.
ఆమె స్నేహితులు, బందువుల వద్ద అప్పు తీసుకుని, బంగారం తాకట్టు పెట్టి క్రెడిట్ కార్డు ఉపయోగించి మొత్తం రూ.15 లక్షలు ఇచ్చింది. డబ్బులు తీసుకున్నాక ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే చైనాకు వెళ్తానని చెప్పి 29–3–2024న వెళ్లాడు. అతడు వెళ్లిన రెండు రోజులకు మృదల బండారు అనే మహిళ ఫోన్ చేసి అప్పారెడ్డి తన భర్త అని, ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడని చెప్పింది.
వెంటనే అప్పారెడ్డికి ఫోన్ చేసి అడగగా అది అబద్దం అని, ఆమె నంబర్ బ్లాక్ చేయమని చెప్పాడు. నెల రోజులకు శ్రీకర్ సీత అనే మహిళ ఫోన్ చేసి అప్పారెడ్డి మోసగాడని, అతడిని వదిలేయాలని బెదిరించింది. దీంతో ఈ మహిళలు అప్పారెడ్డితో ఉండి తనను మోసం చేస్తున్నారని, న్యాయం చేయాలని కనకమహాలక్ష్మి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com