KCRపై మరో అవినీతి ఆరోపణ..CMRF రూ. 200 కోట్ల గోల్ మాల్!

KCRపై మరో అవినీతి ఆరోపణ..CMRF రూ. 200 కోట్ల గోల్ మాల్!

గులాబీ బాస్ కేసీఆర్ (KCR) 2014-2023 హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు (CMRF funds) భారీగా దుర్వినియోగం అయినట్టు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం గుర్తించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీలో భారీ గోల్‌మాల్‌ జరిగిందని లెక్కలను బట్టి తేల్చింది. 2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎలాంటి మెడికల్‌ బిల్లులు లేకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెక్కులను అందించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంలో రూ.200 కోట్లు దుర్వినియోగం అయినట్టు అంచనా వేస్తున్నారు.

మొదటిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఐదేండ్లు పూర్తి కాకుండా ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో అనుచరుల నుంచి లబ్ధి పొందేందుకే ఈ రకంగా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు దీని వెనక ఎవరు ఉన్నారు? ఏ విధంగా ముఖ్యమంత్రి సహాయనిధిని దుర్విని యోగం చేశారు? ఎవరి ఆదేశాలతో ఈ తతంగం నడిపించారనే దానిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందని తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ పెద్ద సంఖ్యలోనే ఉన్నది. అయితే అర్హులైన పేదలు రూ.లక్షల్లో పెట్టుకున్న బిల్లులకు రూ.50 వేల లోపే చెక్కుల రూపంలో అందగా.. ఎలాంటి బిల్లులు లేకుండా రూ.లక్షల్లో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నోళ్లకు అందచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. 2018లో మూడు వేలకు పైగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల్లో లక్షలాది రూపాయలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లాయి. వారు ప్రత్యేకంగా సూచించిన పేర్లకే రూ.10 లక్షలు రూ.15 లక్షల దాకా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందినట్టు తెలిసింది. ఇది రానున్న రోజుల్లో మరింత సంచలనం రేపే చాన్సుంది.

Tags

Read MoreRead Less
Next Story