TS : ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు... పోలీసుల ఉరుకులు

ప్రజాభవన్ లో పోలీసుల విస్తృత తనిఖీలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో.. బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో.. రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ACP మనోహర్ కుమార్ వెంటనే సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది ఆకతాయి కాల్ అనీ.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com