TG : బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట: మంత్రి పొంగులేటి

బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) వెల్లడించారు. హౌసింగ్‌పై సమీక్షలో మాట్లాడుతూ వచ్చే 5ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22.50లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలి దశలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.16లక్షల ఇళ్లు, రిజర్వ్ కోటా కింద 33,500 ఇళ్లను నిర్మిస్తామన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ. 22,500 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో సోమవారం జరిగిన సమావేశంలో కోరాం. రూ.7,740 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ పథకాన్ని భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తర్వాత వారం రోజులకే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో పథకాన్ని తక్షణం అమలు చేయలేకపోయామని మంత్రి చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా.. రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాల కింద పలు హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. రైతులకు రుణమాఫీకి కేబినెట్ కూడా ఆమోదం తెలపటంతో దాని అమలుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు.. రైతుభరోసా, మహిళలకు నెలకు 2500 రూపాయలు, పింఛన్లు లాంటి హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com