TS : బీజేపీ ఎంపీ నవనీత్‌కౌర్‌పై కేసు నమోదు

TS : బీజేపీ ఎంపీ నవనీత్‌కౌర్‌పై కేసు నమోదు

బీజేపీ ఎంపీ నవనీత్‌కౌర్‌పై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రచారంలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల్లో విధుల్లో ఉన్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై 171–సి, ఆర్‌ /డబ్ల్యు 171 –ఎఫ్‌, 171–జి, 188 ఐపీసీ సెక్షన్ల కింద గురువారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... షాద్‌నగర్‌ పట్టణంలో ఈనెల 8న మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాలో నవనీత్‌కౌర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కార్నర్‌ మీటింగ్‌లో భాగంగా ఆమె ప్రసంగిస్తూ... కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంలోని ఎండబెట్ల కృష్ణమోహన్‌ అనే కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు షాద్‌నగర్‌ పోలీసులు పేర్కొన్నారు.

అదేవిధంగా ఎంపీ నవనీత్‌కౌర్‌పై చర్యలు తీసుకోవాలని కడ్తాల మండల యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కందికంటి రాజేందర్‌గౌడ్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేశ ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కౌర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమని, ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story