TS : రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది.
పెద్దపల్లి–మణుగూరు రైల్వేలైన్ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్‌బెల్ట్‌లను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్ నిర్మాణం కానుంది. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా గుర్తించినట్లు తెలిసింది. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం సులువవుతుంది.
ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం పోవాలంటే కాజీపేట మీదుగా తిరిగిపోవాల్సి వస్తోంది. కొత్త రైల్వే లైన్ పూర్తయితే పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లొచ్చు. ఈ క్రమంలో వందల కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. దీంతోపాటు ఈ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఆయా జిల్లాల కలెక్టర్లు తొందరలోనే భూసేకరణ పనులు మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com