Chandrababu Naidu : టీటీడీపి బలోపేతంపై చంద్రబాబు ఫోకస్..

Chandrababu Naidu : టీటీడీపి బలోపేతంపై చంద్రబాబు ఫోకస్..
X

సీఎం చంద్రబాబు నాయుడు పార్టీని తెలంగాణలోనూ బలోపేతం చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ నేతలను కలిసి.. ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. తెలంగాణలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఇప్పుడు మరోసారి అటువైపుగా ఆలోచనలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా తాడేపల్లి లోనే తన క్యాంప్ ఆఫీసులో తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయ్యారు. ఇందులో అనేక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు తెలంగాణలో మారిపోయాయి. అభివృద్ధి చుట్టూ రాజకీయాలు జరుగుతున్న సందర్భంలో పార్టీ కోసం బలంగా కష్టపడే వారికి తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీటీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి అభిప్రాయాలు తీసుకొని.. రాష్ట్ర కమిటీ వేయాలని ఆ తర్వాత వెంటనే మండల కమిటీల వరకు వేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారంట.

తెలంగాణలోనూ ఇప్పటికీ టిడిపికి కొంత అనుకూలత ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికి ఓటు బ్యాంకు అలాగే ఉంది. కాకపోతే పార్టీ పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓటు బ్యాంకు వేరే పార్టీలకు వెళుతుందని చంద్రబాబు కు తెలంగాణ టిడిపి నేతలు వివరించారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ పోటీ చేయడంపై కూడా చర్చించారంట. జూబ్లీహిల్స్ లో టిడిపికి మంచి పట్టు ఉంది. చాలామంది ఏపీ సెటిలర్స్ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు. వాళ్లకు తెలంగాణలో ఓటు హక్కు ఉంది. కాబట్టి వాళ్ల ఓట్లను ఆధారంగా చేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై కూడా ఫోకస్ చేశారంట.

తెలంగాణలో 1.78 శాతం సభ్యత్వ నమోదు చేసినట్టు టిడిపి నేతలు చంద్రబాబు నాయుడుకు తెలిపారు. హైదరాబాదులో ఎక్కువగా టిడిపికి అనుకూలంగా ఉండే ఓట్లు చాలా ఉన్నాయి. గతంలో టిడిపి పోటీ చేసినప్పుడు అవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా టిడిపికి తెలంగాణలో మైలేజ్ పెరగడం ఖాయం. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు గెలుపు ఓటములు తారుమారవుతాయి. కాకపోతే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేకుండా ఎన్నికలకు వెళితే పట్టించుకునే వారు ఉండరు అనేది చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఈ లెక్కన తొందరలోనే పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.

Tags

Next Story