Etala Rajender : పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు.. ఈటల కీలక వ్యాఖ్యలు..

పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
"కొన్ని వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానెళ్లు నేను పార్టీ మారుతున్నట్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. నేను ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ఈటల తన పోస్టులో పేర్కొన్నారు. "బురద చల్లి కడుక్కోమనడం, బట్ట కాల్చి మీద వేయడం మంచి పద్ధతి కాదు. నేను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదు" అని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ మారడమనేది బట్టలు మార్చుకున్నంత సులభం కాదని.. జీవితంలో అది ఒక పెద్ద నిర్ణయంగా ఉండాలని, దానికి బలమైన కారణం ఉండాలని ఈటల అభిప్రాయపడ్డారు. గతంలో తాను టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి గల కారణాలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. "టీఆర్ఎస్ నుంచి నన్ను బయటకు పంపిస్తేనే నేను బయటకు వచ్చాను తప్ప, నా అంతట నేను రాలేదు. కష్టకాలంలో నన్ను బీజేపీ అక్కున చేర్చుకుంది" అని ఉద్ఘాటించారు.
తనపై పదేపదే ఇలాంటి ప్రచారంతో శీలపరీక్ష పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని మీడియాను కోరుతూ, ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఈటల తన పోస్టులో పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com