TS : రేవంత్ రెడ్డి ఆరునెలల్లో అట్టర్ ఫ్లాప్ : ఈటల రాజేందర్

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆరు నెలల్లో అసమర్ధుడుగా పేరు తెచ్చుకోలేదనీ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆరు నెలల్లోనే అసమర్ధ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు.
శుక్రవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, మహబూ బాబాద్ పట్ట భద్రుల సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ .. ఆరు గ్యారంటీలు, 60 హామీలు, 420 పథకాల పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తున్నారన్నారు.
ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాననీ.. రేవంత్రెడ్డి సర్కార్ రుణమాఫీ చేయడమనేది అసాధ్యమని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, ఆగస్టు 15 నాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఈటల గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com