TS : వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
కాగా, గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో వర్షం ధాటికి జనజీవనం స్తంభించిపోయింది.. గ్రేటర్ హైదరాబాద్ నగరం తడిసిముద్దగామారింది. పలు మార్గాల్లో డ్రైనేజిలు పొంగిపొర్లి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంగారెడ్డి పట్టణంలో దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రంగారెడ్డి, వేములవాడ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు చనిపోగా ఐదుగురికి గాయాలయ్యాయి. చాలాచోట్ల ధాన్యం తడిచిపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారడంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com