TG : 2025 డిసెంబర్ నాటికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి : సీఎం రేవంత్ రెడ్డి

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను తొందరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
సాగునీరు, విద్య, వైద్యం, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2025 డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలన్నారు. ఈ నెల 14 లేదా 15న ఇరిగేషన్ మంత్రితో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు ఫైనల్ అప్రూవల్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నెల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కావొద్దన్నారు.
ప్రతి నెల ప్రాజెక్ట్ పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com