Prabhas and RGV : ప్రభాస్, ఆర్జీవీని పొగిడిన సీఎం.. రాజులపై వరాలు

పన్నేండేళ్ల క్రితం మూతపడ్డ నిజాం చక్కెర పరిశ్రమను (ఎన్ఎస్ఎఫ్) తిరిగి తెరిపించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు. పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన నిధులను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అఖిల భారత క్షత్రియ సేవా సమాజ్ ఆదివారం సాయంత్రం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సీఎం రేవంత్ అభినందన సభను నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
క్షత్రియులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, హైదరాబాద్ లో క్షత్రియ సమాజ్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, అనుమతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈసామాజికవర్గానికి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ లో ప్రాధాన్యత కల్పిస్తామని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టు బడులు పెట్టేందుకు క్షత్రియులు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజుల పేరు చెబితే తొలుత తమకు గుర్తొచ్చేది నటుడు స్వర్గీయ కృష్ణంరాజు అని రేవంత్ పేర్కొన్నారు. క్షత్రియ సమాజానికి చెందిన దర్శకులు రాంగోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని తెలిపారు. హాలీవుడ్ తో పోటీ పడుతున్న బాహుబలి ప్రభాస్ ( Prabhas ) సైతం క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన క్షత్రియ సమాజానికి చెందిన రాజుల వల్లే హైదరాబాద్లోని కొంపల్లి ప్రాంతం అభి వృద్ధి చెందిందని చెప్పారు. ఏ రంగంలో రాజులు ప్రవేశించినా అందులో వాళ్లు విజయవంతమవుతారని, రాజులు రాణించడానికి ప్రధాన కారణం వాళ్ల కఠోర శ్రమ, పట్టుదల అని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో అన్ని రంగాల అభి వృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com