Inter : నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు

తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని కాలేజీలు ఈ షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలు ప్రవేశాల కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అడ్మిషన్లకు సంబంధించి ప్రకటనలు ఇవ్వరాదని హెచ్చరించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు; సాంఘిక సంక్షేమ, గిరిజన, మైనారిటీ గురుకులాలు, మోడల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే పదోతరగతి ఫలితాలు ప్రకటించినందున మార్కుల మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఆధారంగా కాలేజీల ప్రిన్సిపాళ్లు ప్రవేశాలు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రవేశాల దరఖాస్తుల జారీ, స్వీకరణ గురువారం నుంచే ప్రారంభించాలన్నారు. ఇంటర్ బోర్డు అనుమతి తీసుకున్న సీట్ల కంటే ఎక్కువ ప్రవేశాలు తీసుకున్న ప్రైవేటు కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించారు. అన్ని కాలేజీలు మొత్తం కోర్సులు, సీట్ల సంఖ్య, భర్తీ అయినవి, మిగిలిన సీట్ల వివరాలను రోజూ నోటీసు బోర్డులో ప్రకటించాలని స్పష్టం చేశారు.
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ప్రకటనలు చేయడం, ప్రవేశాల కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించారు. తొలి విడత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని, జూన్ 1 నుంచి కళాశాలలు పునఃప్రారంభమవుతాయని కార్యదర్శి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com