Hanumakonda RDO : పొన్నం పోటు.. ఆడియోపై హన్మకొండ ఆర్డీవోపై ఫిర్యాదు

పొన్నం ఆడియో వ్యవహారంలో సంచలనం నమోదైంది. తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆడియోను వైరల్ చేసిన వ్యహారంలో హన్మకొండ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఫోన్ కాన్ఫరెన్స్‌లో తాను మాట్లాడిన మాటల్ని ఉద్దేశపూర్వకంగా BRS బిఆర్‌ఎస్ నేతలకు షేర్ చేసి, వాటిని వైరల్ చేయడానికి ఆర్డీఓ రమేష్ బాధ్యుడని పొన్నం ప్రభాకర్ వివరించారు.
తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఇద్దరు అధికారులతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోన్ సంభాషణ లీక్ కావడానికి అది సోషల్ మీడియాలో షేర్ కావడానికి RDO ఆర్డీవో కారణమని పొన్నం గుర్తించారు. ఈ ఘటనపై నిర్దారించుకున్న తర్వాత సిఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు మీడియాకు వివరించారు.
గత వారం కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కోసం హనుమకొండ ఆర్డీవో రమేశ్‌కు మంత్రి పొన్నం ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడిన తర్వాత కమలాపూర్ తహసీల్దార్ మాధవిని కూడా కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని మాట్లాడారు. వారిద్దరితో పొన్నం ఫోన్‌లో మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీపై పలు సూచనలు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉన్నపుడు కూడా.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందనే ఆలోచనతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అతను మా పార్టీ కాదని, ఆయన చేతికి ఒక్క చెక్కు కూడా వెళ్లకూడదని మంత్రి ఈ ఆడియోలో తహశీల్దార్, ఆర్డీవోలకు సూచించారు. చెక్కుల పంపిణీలో అధికారులకు స్వేచ్ఛనిస్తున్నామని, వారే చెక్కులు పంచాలని, అవసరమైతే స్ధానిక సర్పంచులను తీసుకెళ్లి చెక్కులను ఇవ్వాలని మంత్రి సూచించారు. తహసీల్దార్ మాధవితో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన ఆడియో ఈ నెల 15న వైరల్ అయింది. కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కోసం తహసీల్దార్‌తో మాట్లాడుతున్న సమయంలో ఆర్డీవో కూడా కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నారని, అతని నుంచి ఆడియో లీకైనట్టు మంత్రి పొన్నం చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com