TS : బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే కాంగ్రెస్ టికెట్లు

కాంగ్రెస్ (Congress) ప్రకటించిన ఐదుగురు లోక్సభ అభ్యర్థుల్లో ముగ్గురు బీఆర్ఎస్ (BRS) నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారే ఉండడం గమనార్హం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో దిగి గెలిచిన గడ్డం రంజిత్ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీకి దిగనున్నారు. నాలుగు రోజుల క్రితమే రంజిత్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేవెళ్ల నుంచి పోటీ చేద్దామని భావించి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరిన సునీతా మహేందర్ రెడ్డిని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్సభకు పోటీకి దిగనున్నారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ కృష్ణకు పట్టుబట్టి టికెట్ సాధించుకున్నారు. వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముగ్గురికి రాజకీయ అవకాశాలొచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి టికెట్ కోసం అందరి కన్నా ముందే బీఆర్ఎస్ కు లోక్సభ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేయనున్నారు. ఆయన కూడా ఇటివలే కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూలు లోక్సభపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ మల్లు రవికి అదృష్టం వరించినట్లయింది.
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో రెండు ఎస్టీ మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలుండగా నాగర్ కర్నూలు, పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గాల్లో మాల సామాజిక వర్గానికి అవకాశం దక్కింది. పెండింగ్లో ఉన్న వరంగల్ స్థానాన్ని మాదిగలకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి దాకా ప్రకటించిన తొమ్మిది లోక్సభ స్థానాల్లో ఒకే ఒక మహిళకు అవకాశం దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com