TS : కవితకు జైలా.. బెయిలా.. కాసేపట్లో కీలక విచారణ

లోక్ సభ ఎన్నికల సమయంలో సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కోర్టులో మరో కీలక విచారణ జరగనుంది. కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ పై కాసేపట్లో స్పష్టత రానుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22 మధ్యాహ్నం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ నిర్వహించనుంది.
ప్రస్తుతం కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెపై ఈడీ, సీబీఐ పలు కేసులు నమోదుచేసింది. ఈనెల 23 వరకు ఆమెకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రేపు మంగళవారం వరకు ఆమెకు కస్టడీ ఉంది. ఇవాళ బెయిల్ పిటిషన్‌పై కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయి ? అనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
సీబీఐ, ఈడీ తనపై కుట్ర పూరితంగా కేసులు పెట్టాయని.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోర్టును కోరారు కవిత. కవిత పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది. మార్చి 15న కవితను ఈడీ టీమ్ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న తమ కస్టడీలో ఉండగానే కవిత అరెస్ట్ ను మరోసారి చూపించారు సీబీఐ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com