TG : రాజాసింగ్, ఈటల రచ్చ.. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక మరింత లేటు?
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని ఆ పార్టీ అధిష్టానం కొద్ది రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరో 2 నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం జరపాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అధ్యక్ష రేసులో చాలామంది నేతలు, అందులోనూ కీలక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు కూడా ఉండడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడే ఎంపిక చేస్తే విభేదాలు పొడచూపే ప్రమాదం ఉందని ఢిల్లీ కాషాయ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలనుంచి ఆయన్ను తప్పించాలని మొదట బీజేపీ హైకమాండ్ భావించింది. ఎవరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయసేకరణ కూడా చేసింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీలోని సీనియర్ నేతలు కూడా తమ తమ మార్గాల్లో అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల తూటాలు పేలాయి. రాజాసింగ్ వర్సెస్ ఈటల వివాదం అధిష్టానం వద్దకు కూడా చేరింది.
అదే సమయంలో పార్టీలోని నేతలు పాత, కొత్త తరంగా విడిపోయారు. మరోవైపు సంఘ్ పరివార్ నేతలు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి తమకు ఇవ్వాలని రేసులోకి వచ్చారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని సీనియర్ నేతలు పార్టీ హైకమాండ్ వద్ద డిమాండ్ ఉంచారు. అదే సమయంలో పార్టీలో ఇటీవల చేరిన కొత్త నేతలకు, అందులోనూ వచ్చి రాగానే ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వొద్దన్న అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. దీంతో.. కొద్ది వారాల గడిచాక నిర్ణయం తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com