Kavitha Case : కవిత కేసులో సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Kavitha Case : కవిత కేసులో సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
X

హైదరాబాద్: లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారులు ప్రశ్నించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై గురువారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ క్రమంలోనే కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కవిత పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం ఆదేశిచింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరగనుండగా, అదే రోజున సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌‌పై కూడా విచారణ చేపట్టనున్నట్టుగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టైన కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నోటీసులు జారీ చేసింది. మే 24న ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో కూడా కవిత బెయిల్ పిటిషన్‌పై అదే రోజు విచారణ జరపనున్నట్టుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

Tags

Next Story