TG : పబ్బుల్లో డ్రగ్స్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

డ్రగ్స్, గంజాయి, తదితర మాదకద్రవ్యాల లాంటి వాటిని ప్రోత్సహిస్తే కఠిన శిక్షలు తప్పవని రాష్ట్రంలోని పబ్ల యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ, తెలంగాణ పోలీస్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఆసక్తికర పోస్ట్ చేశారు. డ్రగ్స్, గంజాయి మాదక ద్రవ్యాలపై నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారు.
ఈ విషయమై డ్రగ్స్ రవాణా, వినియోగం పట్ల ప్రజల వద్ద ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా 8712671111కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై దూకుడు పెంచిన పోలీసులు ఇప్పటికే వారాంతాల్లో స్నిపర్ డాగ్స్ తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందనే సమాచారంతో నగరంలోని పలు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పబ్ యజమానులు యువతను ఆకర్షించటానికి డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తే మాదకద్రవ్యాల చట్టాలు, శిక్షలు కఠినంగా ఉంటాయని పేర్కొంది. యువత పబ్బుల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com