TS : కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు పంపించారు. బుధవారం గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రత్నిస్తుండగా.. ఆయన చేరికను నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతోపాటు పలువురు సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నందున ఇంద్రకరణ్ రెడ్డి ప్రయత్నాలకు మార్గం సుగమమైంది. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు కొందరు కాంగ్రెస్లో చేరారు.
2014 ఎన్నికల్లో నిర్మల్ నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి.. ఆ వెంటనే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నిక్లలోనూ నిర్మల్ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి మంత్రి పదవి చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com