గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం

గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారం సాగుతున్నాయి. మంత్రి కేటీఆర్.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అల్వాల్, యాప్రాల్, ఆనంద్ బాగ్, గౌతంనగర్ బాగ్ అంబర్‌పేట, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పరిశ్రమలు,పెట్టుబడులు, ఉద్యోగాలు సాధ్యమని చెప్పారు. బీజేపీ నేతలు ఉద్వేగాలు రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడింది బీజేపీ. భాగ్యనగర్‌లో విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లు పక్కా సమాచారం ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గొడవలు జరిగాక అరెస్ట్ చేస్తారా అని నిలదీసారు. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. ఓటింగ్‌కు జనం రాకుండా.. సీఎం కేటీఆర్ ఓ పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారన్నారు.
అటు కాంగ్రెస్ సైతం.. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌హయంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఓట్ల కోసం టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు దిగజారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బండిసంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.
అటు.. ఎంఐఎం మతతత్వ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నరాంటూ మండిపడ్డారు ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎం మనసులను కలిపే ప్రయత్నం చేస్తుందని, మనుషుల్ని విడదీసే ప్రయత్నం ఎప్పటికి చేయదన్నారు. 1960 నుంచి.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. మొత్తానికి.. నేతల పోటాపోటీ ప్రచారాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. గ్రేటర్ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. గ్రేటర్ ఓటర్లు... ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com