TS : రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: హరీశ్‌రావు

నీరు లేక పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఅర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. ‘20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీఎం, మంత్రులు అన్నదాతకు భరోసా కల్పించడం లేదు. కాంగ్రెస్ పాలనలో వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుణాలు చెల్లించాలని అధికారులు రైతులను వేధిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు’ అని హరీశ్ అన్నారు.పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని, ఈ నేపథ్యంలో రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
డిసెంబర్ 9న నా మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల సమయంలో చెప్పారు. ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేశారు. బ్యాంకుకు వెళ్లి అప్పులు తెచ్చుకోండి.. మేం కడుతాం అన్నారు. కానీ డిసెంబర్ 9 కంటే రెండు రోజుల ముందే ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసి 100 రోజులు దాటింది. ఇప్పటికీ రుణమాఫీపై మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో రైతులను బ్యాంకర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com