TS : సికింద్రాబాద్ లో కొత్తపోటీ.. కిషన్ వర్సెస్ తలసాని వర్సెస్ దానం!
లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీల్లో చేరికలు, వలసతో సికింద్రాబాద్ రాజకీయం రసపట్టులో పడింది. సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం దిగ్గజాలు పోటీ పడబోతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థులు ఎవరు అన్నదానిపై క్లారిటీ వస్తోంది. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో కీలక నేతలుగా ఉన్న వారే పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున దానం నాగేందర్, బీఆర్ఎస్ తరపున తలసాని పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. గత రెండు సార్లు బీజేపీ గెలిచింది. మజ్లిస్ పోటీ చేస్తే బీజేపీకి తిరుగులేని విజయం దక్కుతుంది. గతంలో బీఆర్ఎస్ అవగాహన మేరకు మజ్లిస్ పోటీ చేయలేదు. ఈ సారి కాంగ్రెస్ తో మజ్లిస్ ఆ మేరకు అవగాహన పెట్టుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచించడంలోనే ప్రత్యేకమైన వ్యూహం ఉందని అనుకుంటున్నారు. తన కుమారుడికి సీటు కోసం తలసాని ప్రయత్నించినా గులాబీ అగ్రనేతలు ఆయననే బరిలోకి దించాలని అనుకుంటోంది. దీంతో.. సీనియర్ల మధ్యే పోటీ అనివార్యమైంది.
2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ పరిధిలో ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఒక్క చోట మజ్లిస్ గెలిచింది. ఆ ఆరింటిలో ఖైరతాబాద్ కూడా ఉంది. బీఆర్ఎస్ మెరుగ్గా కనిపిస్తున్నా కూడా అసెంబ్లీ వేరు.. లోక్ సభ పోటీ పరిస్థితి వేరు అంటోంది బీజేపీ. కాంగ్రెస్ కూడా దీనిపై ఆశలు పెట్టుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com