USA : తెలుగు యువతి మృతిపై దర్యాప్తునకు భారత్ డిమాండ్

USA : తెలుగు యువతి మృతిపై  దర్యాప్తునకు భారత్ డిమాండ్
ఘటనపై స్థానిక పోలీసుల జోకులు..సర్వత్రా ఆగ్రహం

అమెరికాలో ఆంధ్రా యువతి మరణాన్ని పోలీసులు అవహేళన చేసిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని భారత్ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.ఆ మరణాన్ని తక్కువగా చూపుతూ పోలీస్ అధికారి చులకనగా మాట్లాడటంపై అమెరికా దర్యాప్తు చెయ్యాలంది. యువతి మరణాన్ని చులకన చేస్తూ పోలీసులు చేసిన వ్యాఖ్యల తాలూకు ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ కార్ ఢీకొట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతి జాహ్నవి కందుల మరణించింది. సియాటెల్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో కారును కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కేసులో ఘటనాస్థలానికి వేగంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు జాహ్నవిని ఢీకొట్టినట్టు తేలింది. ఈ ఘటనపై పోలీసు యూనియన్.. బాధిత కుటుంబానికి 11 వేల డాలర్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై మరో ఇద్దరు పోలీసుల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ అధికారి జాహ్నవి మరణాన్ని అవహేళన చేశారు. ‘‘ఆమెకు 26 ఏళ్లే.. ఓ సాధారణ వ్యక్తి. ఆమె ప్రాణానికి అంత విలువేమీ లేదు. పరిహారం ఇవ్వండి’’ అంటూ సియాటెల్ పోలీసుల సంఘం వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్ చేసిన చులకన వ్యాఖ్యలు అతడి యూనిఫాంకు అమర్చిన మైక్‌లో రికార్డయ్యాయి. డిపార్ట్‌మెంట్‌లో జరిగిన సాధారణ తనిఖీల్లో ఈ ఆడియో బయటపడటంతో వివాదానికి దారి తీసింది.


ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారత కాన్సులేట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి మరణంపై ఇటువంటి చులకన వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమని , ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవలని కోరింది. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సియాటెల్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని సియాటెల్, వాషింగ్టన్‌లో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేశామని కాన్సులేట్ కార్యాలయం ‘ఎక్స్’ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.ఏపీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన జాహ్నవి సియాటెల్ లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తోంది. ఎంస్ చదివేందుకు 2021 సెప్టెంబర్ లో యూనివర్సిటీలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story