TS : కాంగ్రెస్ తీరుపై కరీంనగర్ రైతుల ధర్నా

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శిస్తూ జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు పండించిన వరి ధాన్యానికి క్వింటాలుకు 500 అదనంగా బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. వ్యవసాయ మార్కెట్‌లలో రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్‌లో తూకం వేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లుకు తరలించి రైతులకు డబ్బులు అందించాలని కోరారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. అనంతరం పోలీసులు ధర్నా విరమింప చేయడంతో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com