Bonalu Festival : బోనాల ఉత్సవాల్లో కర్ణాటక ఏనుగు

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ గారి ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్రంలో బోనాల ఉత్సవాల్లో అమ్మ వారి అంబారీ ఊరేగింపుతో పాటు మొహర్రం పండుగ (బీబీ కా ఆలం అంబారీ ఊరేగింపు) నిమిత్తం కర్ణాటక అటవీ శాఖ తెలంగాణకు ఏనుగు (రూపవతి)ను తరలించేందుకు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
మంత్రి కొండా సురేఖ కర్ణాటక అటవీశాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో ఈ విషయం పై పలుమార్లు చర్చించారు. తెలంగాణకు కర్ణాటక నుంచి ఏనుగు తరలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో కర్ణాటక దావణగిరెలోని పాంచాచార్య మందిర ట్రస్టు నుంచి ఏనుగు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. అటవీ చట్టాల అనుసరించి ఏనుగు తరలింపులో పాటించాల్సిన జాగ్రత్తలు, పర్యవేక్షణ తదితర అన్ని రకాల మార్గదర్శకాలను అనుసరించి ఏనుగును రాష్ట్రానికి తీసుకురానున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
ఏనుగు రాష్ట్రానికి చేరుకున్న తర్వాత ఏనుగు పోషణ, విశ్రాంతి తదితర అంశాలకు సంబంధించి అటవీ చట్టాలు మార్గదర్శకాలను పాటించాల్సిందిగా అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com