TG : ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినలేదు: కోదండరాం

మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం మంచిది కాదని ఇంజినీరింగ్ కమిటీ చెప్పినా అప్పటి సీఎం కేసీఆర్ ( KCR ) పట్టించుకోలేదని TJS అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టడం, డిజైన్ ప్రకారం నిర్మించకపోవడం, నిర్వహణ లోపంతో మేడిగడ్డ కుంగిందని డ్యాం సేఫ్టీ అధికారులు కూడా తేల్చారని తెలిపారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని సర్కార్ పున:పరిశీలించాలని కోదండరాం కోరారు. మేడిగడ్డ తప్పిదానికి బాధ్యులపై చర్యలు తీసుకుని శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు.
విచారణ కమిషన్ వేయాలని బీఆర్ఎస్సే కోరిందని తెలిపారు. కమిషన్ వేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీ వేదికగా ఆ పార్టీయే కోరిందన్నారు. ప్రజల సొమ్మును ఏ ప్రభుత్వమైనా బాధ్యతగా ఖర్చు చేయాలన్నారు. విచారణ కమిటీలను రద్దు చేయించి వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వైఖరిని తాను ఖండిస్తున్నానన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తమపైన ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యమని కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో మాపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నా. బొగ్గు గనులను వేలం వేయడమంటే అది ప్రైవేటీకరణకు దారి తీస్తుంది. బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని కోదండరాం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com