TS : ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ ప్రెస్ మీట్

ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ‘బస్సు యాత్ర ద్వారా ఆయన ఏం తెలుసుకున్నారు? ప్రజల మూడ్ ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఎంత ఉంది?’ అనే ప్రశ్నలన్నింటికీ ఆయన ప్రెస్‌మీట్‌లో సమాధానం చెప్పబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర నిన్నటితో ముగిసింది. నిన్న సిద్దిపేటలో జరిగిన సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు. 16 రోజులపాటు 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ మనుగడను నిర్ధారించేవిగా మారాయనే చర్చ జరుగుతోంది. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవడం ద్వారా తిరిగి తమ సత్తా ఎంటో నిరూపించుకునేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు బస్సు యాత్ర రూపంలో రాష్ట్రమంతా చుట్టి వచ్చిన కేసీఆర్ ప్రచారానికి చివరి రోజు మాత్రం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com