TS : తెలంగాణను చూస్తుంటే బాధేస్తోంది: కేసీఆర్

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలోని కాల్వలను నీళ్లతో నింపితే.. ఇప్పుడు ఎండబెడుతోంది. రైతు బంధుకు 5 ఎకరాలకు కాదు.. 25 ఎకరాలకు సీలింగ్ పెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉంది. మోసపూరిత హామీలు నమ్మి జనం కాంగ్రెస్‌కు ఓటేశారు. గోదావరి నీటిని కర్ణాటక, తమిళనాడుకు ఇస్తానని మోదీ అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడటం లేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేయాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా కేసీఆర్ సోమవారం పార్లమెంట్ఎన్నికల ప్రచారం కోసం నిజామాబాద్ రానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ రోడ్‌షో, కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి రోడ్ షో ఉంటుందని నెహ్రూపార్క్, గాంధీ చౌరస్తా మధ్యలో కార్నర్‌మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇంట్లో రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం కామారెడ్డికి బస్సుయాత్ర వెళ్తుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com