TG : కేసీఆర్ గతే మీకు పడుతుంది.. ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్

TG : కేసీఆర్ గతే మీకు పడుతుంది.. ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్
X

నిరుద్యోగుల ఆశలను తెలంగాణ ప్రభుత్వం అడియాశలు చేసిందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తుందని నమ్మి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని, ఇప్పుడు ఉద్యోగాలే భర్తీ చేయాలని పరిస్థితి నెలకొందని అన్నారు. నియామకాలు చేపట్టాలని ప్రశ్నించే వారిని అణిచివేయడం విచారకరమని పేర్కొన్నారు. గద్దెనెక్కిన తర్వాత గర్వంగా వ్యవహరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతి పడుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు.. ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని ఈటల సూచించారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికుల కంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. నిత్యం పని ఒత్తిడి, తక్కువ వేతనాలతో సతమతమవుతున్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. మానవతా దృక్పథం కలిగిన ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని, ఏళ్ల తరబడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరీక్షిస్తున్నారని ఆర్ కృష్ణయ్య చెప్పారు.

Tags

Next Story