Keshava Rao : కేశవరావు అలక.. కాంగ్రెస్ హైకమాండ్‌పై సీరియస్

Keshava Rao : కేశవరావు అలక.. కాంగ్రెస్ హైకమాండ్‌పై సీరియస్
X

తన మాతృపార్టీ కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ మాజీ నేత, కేసీఆర్ సన్నిహితుడు.. కేశవ రావు అలిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీప్‌దాస్ మున్షీలు తదితర సీనియర్ నేతలు కేకేతో ఉన్నారు. వారంతా కేకేను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఢిల్లీలోని ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, కే. కేశవరావు, మధుయాష్కి సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్‌ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌ పెద్దలతో సీఎం రేవంత్‌ చర్చించారు. పీసీసీ రేసులో ఉన్న ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో ఉన్నారు. అయితే ఈ సమావేశాన్ని వదిలి కేకే వెళ్లిపోయారు. కేశవరావు అలా వెళ్తుంటే కనీసం ఎవ్వరూ ఆపలేదు.

పార్టీలో చేరిన తనకు పీసీసీ పదవి ఇస్తారని కేకే ఆశలు పెట్టుకున్నారనీ.. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి కేకే వెళ్లిపోయినట్టు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై కేకే చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతలకు నిరాశే ఎదురవుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ కి తేల్చిచెప్పింది. అయినప్పటికి కొందరు ఎమ్మెల్యేలు ఇతర ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. కేశవరావును హైకమాండ్, రేవంత్ ఎలా బుజ్జగిస్తారన్నది చూడాలి.

Tags

Next Story