Kishan Reddy : అందుకే బొగ్గు గనుల వేలం వేస్తున్నం: కిషన్‌రెడ్డి
దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకే బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) వెల్లడించారు. మార్కెట్‌లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని, బొగ్గు అంటే నల్ల బంగారమని అభివర్ణించారు. బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని, అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా వేలం వేయడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు సింగరేణి మూతపడే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరం. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని భట్టి అన్నారు. ఇందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని, గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్ లకు సింగరేణికే కేటాయించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందని భట్టి విమర్శించారు. సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల సంస్థ.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ గనులను సింగరేణికు కేటాయించవచ్చునని భట్టి అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com